ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దామంటున్న ఎన్టీఆర్..!

Saturday, March 13th, 2021, 05:02:57 PM IST

బిగ్‌బాస్ సీజన్ 1 కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించి వెండి తెరపైనే కాకుండా బుల్లెతెరపై కూడా యమ క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్‌టీఆర్ తాజాగా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమం చేయబోతున్నాడు. అయితే జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది.

ఈ ప్రోమోలో మొదట హాయ్ అంటూ కనిపించిన తారక్ షో గురుంచి వివరించారు. ఇక్కడ కల మీది, కథ మీది.. ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం అంటూ అందరిని ఆకట్టుకున్నాడు. ఇదే కాకుండా ఇక్కడ మీరు ఏం గెలుచుకున్నా గెలుచుకోకపోయినా.. జీవితంలో ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ ను మాత్రం మీకు వచ్చేలా చేస్తా అంటూ ప్రామిస్ చేయడం ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది. అంతే కాదు చివరలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ సైనింగ్ ఆఫ్ మీ రామారావు అని సింపుల్‌గా ముగించాడు.

ఇదిలా ఉంటే జెమినీ టీవీలో 2014 జూన్‌లో ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 1 సూపర్ సక్సెస్‌గా నిలిచింది. అదే ఏడాది డిసెంబర్‌లో రెండో సీజన్ కూడా జ‌రుపుకుంది. 2015 నవంబర్‌లో మూడో సీజన్‌ కూడా జరిగింది. అయితే ఈ మూడు సీజన్లకు అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌కు మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించారు.