గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్.. నేటి నుంచి అసలు ఆట షురూ..!

Monday, September 7th, 2020, 09:52:59 AM IST

తెలుగు రియాలిటీ బిగ్గెస్ట్ షో బిగ్‌బాస్ సీజన్ 4 ఎట్టకేలకు గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. మంచి డ్యాన్సులతో అదరగొట్టిన నాగ్ ఆ తరువాత డబుల్ ధమాకాతో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ పక్క కుర్ర నాగార్జున కంటెస్టంట్లందరిని స్టేజ్ మీదకు పిలుస్తుంటే, మరో పక్క ముసలి నాగార్జున టీవీ ముందు కూర్చుని కామెంట్లు పాస్ చేస్తూ కనిపించారు.

అయితే గత సీజన్లలో కన్నా ఈ సారి సీజన్‌లో కాస్త రూల్స్ మార్చారు. గత సీజన్లలో హౌస్‌మేట్స్ అందరిని లోపలికి పంపించిన తరువాత ఆట మొదలయ్యేది. కానీ ఈ సారి మాత్రం నలుగురు హౌస్‌మేట్స్‌ని లోపలికి పంపిన వెంటనే నాగార్జున ఆట మొదలెట్టేశారు. కనెక్టింగ్ గేమ్ అంటూ ఒక వీల్‌పై నాలుగేసి లక్షణాలతో ఉన్న నెంబర్లు ఉంచి వాటిలో వారికి సూటయ్యే లక్షణాలను సెలక్ట్ చేసుకోవాలని చెప్పి ఆ నెంబర్లకు సంబంధించి బాక్స్ లు తీసుకోమన్నారు. ఆ తరువాత వచ్చిన ఒక్కో హౌస్‌మేట్‌కి గిఫ్ట్ బాక్స్ అంటూ ఒక బాక్స్ ఇచ్చి లోపలి పంపించారు నాగ్. అయితే ఆ బాక్స్‌లో ఉన్న నెంబర్ లోపల ఉన్నవారి నెంబర్‌తో మ్యాచ్ అయిన వారితో వీరు కనెక్ట్ అవుతారని చెప్పారు.

ఇదిలా ఉంటే మొత్తం 16 మందిని హౌస్ లోకి పంపించిన నాగార్జున సయ్యద్ సోహైల్, అరియానా గ్లోరీ ఇద్దరిని మాత్రం ప్రత్యేకంగా ఉంచారు. దీంతో 14 మందితో హౌస్‌లో హంగామా షురూ అయ్యింది. అయితే 15 వారాల పాటు 16 మందితో సాగే ఈ షో నేటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో అసలు ఆట షురూ కాబోతుంది.