మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్‌బాస్‌కి కలిసొచ్చేనా?

Monday, September 14th, 2020, 12:35:42 PM IST

ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 4 ఎట్టకేలకు మొదటి వారం పూర్తి చేసుకుంది. కాగా ఈ ఆదివారం ఎపిసోడ్ మరింత జోరుగా జరిగింది. సండే ఫన్ డే అంటూ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున రాములో రాములా పాటకు స్టెప్పులేసి అలరించారు. అంతేకాదు అందరూ అనుకున్నట్టే మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి చేసి, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరొక కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపించారు. అయితే ముందుగా హొస్‌మేట్స్ అందరిని రెండు టీం లుగా విడదీసి పోటీలు నిర్వహించారు. ఇందులో లేడీస్ బ్యాచ్ గెలిచింది. అయితే ప్రత్యేకంగా గంగవ్వ డ్యాన్స్‌తో అదరగొట్టడంతో ఆమెకు నాగార్జున పదికి పది పాయింట్లు ఇచ్చేశాడు.

అయితే ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో ఎవరి సేఫ్ జోన్‌లో ఉన్నారో పాట ద్వారా తెలుస్తుందని, ఆ పాటలో ఎవరి పేరు వస్తే వారు సేఫ్ జోన్‌లో ఉన్నట్టు అని తెలిపాడు. అయితే అఖిల్ పేరుతో పాట ప్లే అవ్వడంతో అఖిల్ సేఫ్ అయినట్టు తెలిపాడు. ఆ తరువాత హౌస్‌లోని కనెక్షన్ జంటలతో డ్రాయింగ్ గేమ్ ఆడించి అందులో నుంచి నాగ్ ఓ పెయింటింగ్ తెప్పించాడు. అయితే ఆ పెయింటింగ్‌లో ఎవరైతే ఉంటారో వారి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలిపాడు. అయితే అందులో మెహబూబ్ పెయింటింగ్ ఉండడంతో అతను సేఫ్ అయ్యాడు.

ఇక మోనాల్‌తో మాట్లాడిన నాగార్జున మొదటి రోజు హొస్‌లోకి అందరూ వచ్చినప్పుడు మంచి నీళ్ళు ఇచ్చి ఆహ్వానించావని అది చాలా మంచి అలవాటు అని అన్నారు. అయితే మరోసారి మోనాల్‌ను ఒక గ్లాస్ వాటర్ తీసుకురమ్మన్న నాగ్ దివి, సూర్యకిరణ్‌లో ఒకరికి ఇవ్వమన్నాడు. అయితే ఆమె సూర్య కిరణ్‌కు వాటర్ ఇవ్వడంతో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఒకవేళ మోనాల్ దివికి వాటర్ ఇచ్చి ఉంటే దివి ఎలిమినేట్ అయ్యేదేమో. ఇలా ఎట్టకేలకు మొదటి వారం హౌస్‌లో నుంచి సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత ఒక సస్పెన్స్ అంటూ ఈరోజుల్లో సినిమాలో నటించిన కుమార్ సాయిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోపలికి పంపించారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికి ఈ సీజన్ మాత్రం పెద్దగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుందన్న టాక్ బయట బలంగా వినిపిస్తుంది. అయితే అందుకు ప్రధాన కారణం కంటెస్టెంట్లుగా పంపిన వారిలో జనాలకు తెలిసిన ముఖాలు ఎక్కువగా లేకపోవడం, మునుపటి సీజన్ల కన్నా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ లోపించదన్న సందేహాలు నెలకొనడంతో నిర్వాహకులకు అనుకున్న రేటింగ్ రావడం లేదని సమాచారం. ఒక్క గంగవ్వ ఒక్కటే ఈ సీజన్‌కి కలిసొచ్చిన అంశం అని చెప్పాలి. మరీ మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిన సాయి కుమార్ అయిన ప్రేక్షకులను ఆకట్టుకుని బిగ్‌బాస్‌కి కలిసొచ్చేట్టు అవుతాడో లేదో చూడాలి మరీ.