బీసీసీఐ చూసుకుంటే ఆస్ట్రేలియాకు నేను వెళ్తా.. సెహ్వాగ్ ఫన్నీ ట్వీట్..!

Wednesday, January 13th, 2021, 02:11:41 AM IST

ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆటగాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే గాయాలతో మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌లు జట్టుకు దూరమవ్వగా, మొన్న జరిగిన మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారీలు గాయపడ్డారు. తాజాగా టీమిండియా ప్రధాన అస్త్రం, కీలక బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. పొత్తి కడుపు నొప్పి కారణంగా అతను సిరీస్‌ నుంచి వైదొలిగాడు.

అయితే నాలుగో టెస్టుకు సగం జట్టు ఖాళీ అవ్వడంతో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. నాలుగో టెస్టుకు 11 మంది ఆటగాళ్లు లేకపోతే చెప్పండి. నేను ఆస్ట్రేలియా వెళ్తా, కానీ క్వారంటైన్‌ నిబంధనలను బీసీసీఐ చూసుకోవాలని వీరూ బాయ్ ఫన్నీగా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.