ఇక పై రోహిత్ తో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తా – విరాట్ కోహ్లీ

Sunday, March 21st, 2021, 12:00:26 PM IST

ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ టీ 20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తో ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీమ్ ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ తో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తా అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు. చివరి మ్యాచ్ లో 36 పరుగుల తేడా తో ఘన విజయం సాధించి సిరీస్ ను 3-2 తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా నిర్దేశించిన 224 పరుగులని చేయడం లో ఇంగ్లాండ్ విఫలం అయింది. ఇంగ్లాండ్ 20 ఓవర్ లకు 188 పరుగులు చేసి 8 వికెట్ లను కోల్పోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అర్థ శతకాలతో అదరగొట్టారు. రోహిత్ 64 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ కూడా ఆఖరి మ్యాచ్ లో కీలకం అయ్యారు. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా ప్రదర్శన పై ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ శర్మ తో మళ్ళీ కలిసి ఓపెనింగ్ చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఇది తమకు సంపూర్ణ విజయం అని, ప్రత్యర్ధి పై అన్ని విభాగాల్లో అదరగొట్టామని అన్నారు. 224 భారీ స్కోర్ సాధించాం అని, ఇది బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.మిగతా బ్యాట్స్ మన్ బ్యాటింగ్ చేయకుండానే భారీ స్కోర్ సాధించాం అని, మిడిల్ ఆర్డర్ కూడా టీమ్ లో బలంగా ఉందని వివరించారు. శ్రేయాస్ అయ్యర్, భువి, ఇషాన్, సూర్య, పంత్, శార్దూల్ పై ప్రశంసల వర్షం కురిపించారు.