టాస్ ఓడినా ఈ సారి ఓడలేదు.. ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన టీమిండియా..!

Friday, March 19th, 2021, 12:01:45 AM IST

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నేడు ఎంతో ఉత్కంఠగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(12), కేఎల్ రాహుల్(14), కెప్టెన్ విరాట్ కోహ్లీ(1) వెంటనే ఔటైనా, ఈ మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన సూర్య కుమార్ యాదవ్ (57; 31 బంతులు, 4క్ష్4, 3క్ష్6) అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఇక రిషబ్ పంత్(30), శ్రేయాస్ అయ్యర్(37) కూడా రాణించడంతో టీమిండియా మంచి స్కోరును చేయగలిగింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోస్ బట్లర్(9) వెంటనే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ జేసన్ రాయ్(40), బెన్ స్టోక్స్(46) ఇద్దరు రెచ్చిపోయి ఆడారు. జేసన్ రాయ్ ఔటైనా బెన్‌స్టోక్స్ క్రీజులో ఉన్నంతసేపు టీమిండియాపై ఒత్తిడి పెంచాడు. అయితే శార్ధూల్ తన 17వ ఓవర్‌లో వరుస బంతుల్లో స్టోక్స్, కెప్టెన్ మోర్గాన్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా టీమిండియా చేతుల్లోకొచ్చింది. అయితే చివరలో జోఫ్రా ఆర్చర్(18) బ్యాటు ఝుళిపించి కొంత టెన్షన్ పెట్టినా ఎట్టకేలకు టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, రాహుల్ చాహర్, పాండ్యా 2 వికెట్లు, భువనేశ్వర్ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో 5 టీ20ల సిరీస్ 2-2తో సమం అయ్యింది. ఇక ఈ నెల 20న జరిగే ఐదో టీ20లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.