చివరి వన్డేలో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్..!

Wednesday, December 2nd, 2020, 06:40:48 PM IST

క్యాన్‌బెరా వేదికగా నేడు ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో ఎట్టకేలకు భారత్ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి, రెండో మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావించిన ఆసీస్‌కు కోహ్లి సేన బ్రేక్స్ వేసింది. చివరి వన్డేలో ఆసీస్‌పై గెలిచి పరువు నిలుపుకుంది. భారత్ నిర్ధేశించిన 303 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఆసీస్ విఫలమయ్యింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలో తడబడినా, చివర్లో జడేజా 66 పరుగులు చేయగా, హార్ధిక్ పాండ్యా 92 పరుగులతో రెచ్చిపోయి ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. అనంతరం 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన లబుషేన్‌ను వ‌న్డే అరంగేట్రం చేసిన న‌ట‌రాజ‌న్ తొలి వికెట్ తీశాడు. కెప్టెన్ ఫించ్ 75 పరుగులు, మాక్స్‌వెల్‌ 59 పరుగులతో రాణించినా వీరిద్దరూ ఔట్ అయ్యాక ఆసీస్ వరుస వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 49.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది.