టీ-20: శ్రీలంకపై సునాయాసంగా నెగ్గిన టీమిండియా..!

Tuesday, January 7th, 2020, 10:58:37 PM IST

భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ సునాయాసంగా గెలిచింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులను చేయగలిగింది. అయితే శ్రీలంక బ్యాటింగ్‌లో ఓపెనర్లు ధనుష్క గుణతిలక 20 పరుగులు, అవిష్క ఫెర్నాండో 22 పరుగులు చేయగా వికెట్ కీపర్ కుశల్ పెరేరా 34 పరుగులు తప్పా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోవడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది. అయితే భారత బౌలర్లలో శార్ధూల్ 3 వికెట్లు తీయగా, నవదీప్ శైనీ, కుల్దీప్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. కేఎల్ రాహుల్ 45 పరుగులు, ధావన్ 32 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు చేసి ఔట్ కాగా, కోహ్లీ 30 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల నష్టపోయి 144 పరుగులు చేసి భారత్ విజయాన్ని అందుకుంది. అయితే మూడు మ్యాచ్‌లలో భాగంగా భారత్ ఈ మ్యాచ్ గెలవడం, మొదటి టీ-20 వర్షం కారణంగా రద్దు కావడంతో 1-0 తో టీమిండియా ముందంజలో ఉంది.