ముంబైపై గెలుపుతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కి.. కోల్‌కత్తా ఇంటికి..!

Wednesday, November 4th, 2020, 12:18:25 AM IST


ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో సన్‌రైజర్స్ బిగ్ విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ప్లే ఆఫ్స్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్ ముంబైపై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్‌ 25 పరుగులు, సూర్యకుమార్ 36 పరుగులు, ఇషాన్ కిషన్ 33 పరుగులు రాణించగా, చివరిలో పోలార్డ్ 41 పరుగులతో విజృంభించాడు.

అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ఓపెనర్లే విజయాన్ని అందించారు. డేవిడ్ వార్నర్ 85 పరుగులు, వృద్ధిమాన్ సాహా 58 పరుగులు చేయడంతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 17.2 ఓవర్లలోనే ముంబైపై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టడమే కాకుండా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. సన్‌రైజర్స్ గెలుపుతో కోల్‌కత్తా ప్లే ఆఫ్స్ ఆశలు కొట్టుకుపోయాయి.