సురేశ్ రైనాకు సాయం చేసిన సోనూసూద్..!

Friday, May 7th, 2021, 12:48:14 AM IST

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేస్తూ వస్తున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలలనుంచి ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్న సోనూసూద్ తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి కూడా కష్టకాలంలో సాయం అందించాడు. అయితే మీరట్‌లో ఉన్న 65 ఏళ్ల తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలంటూ రైనా ట్వీట్ చేశాడు.

అయితే తన ఆంటీకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు కోవిడ్ కూడా ఉంది. దయచేసి సాయం చేయండి అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ను ట్యాగ్ చేస్తూ రైనా ట్వీట్ చేశాడు. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ రైనా ట్వీట్‌కు స్పందించకపోయినా సోనూసూద్ వెంటనే స్పందించి వివరాలు పంపాల్సిందిగా సురేశ్ రైనాను కోరాడు. దీంతో సోనూసూద్‌కి వివరాలు మెసేజ్ చేసి రైనా ధన్యవాదాలు తెలిపాడు. మరో 10 నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి చేరుకుంటుంది భాయ్‌ అంటూ సోనూసూద్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన ఫౌండేషన్ ద్వారా ఆమెకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చూసుకుంటున్నాడు. దీంతో మొత్తానికి మరోసారి సోనూసూద్ రియల్ హీరో
అనిపించుకున్నాడు.