బాక్సర్ సరితకు మద్దతిచ్చిన సచిన్

Thursday, November 20th, 2014, 12:02:15 PM IST

sachin_Saritha
ఇంచియాన్ ఏషియాడ్ లో పతకం తీసుకునేందుకు నిరాకరించినందుకు ఫలితంగా ఏఐబీఏ నుండి తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న బాక్సర్ సరితాదేవికి క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు సచిన్ కేంద్ర క్రీడాశాఖ మంత్రికి సరితకు న్యాయం జరిగేలా చూడాలని లేఖ రాసారు. అలాగే బాక్సర్ సరిత కెరీర్ అర్ధాంతరంగా ముగియకుండా చర్యలు తీసుకోవాలని సచిన్ తన లేఖలో విజ్ఞ్యప్తి చేశారు.

ఇక ఒక క్రీడాకారుడుగా సరిత భావోద్వేగాలను తాను అర్ధం చేసుకోగలనని, జరిగిన సంఘటనలో బాక్సర్ తన భావోద్వేగాలను అణుచుకోలేక దురదృష్టవశాత్తు బహిర్గతమైందని సచిన్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆమె తన చర్యలకు వెంటనే క్షమాపణలు కూడా చెప్పిందని, పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని సచిన్ పేర్కొన్నారు. ఇక ఈ నేపధ్యంగా సరితకు మరో అవకాశం ఇవ్వాలని, ఈ అంశంలో సరితకు యావత్ భారతం అండగా నిలిచి ఆమె అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం కల్పించాలని సచిన్ తన లేఖలో పేర్కొన్నారు.