ఆఖరిలో చేతులెత్తేశారు.. ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్‌కి అనూహ్య ఓటమి..!

Thursday, April 15th, 2021, 12:54:44 AM IST


చెన్నై వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. సునాయాసంగా గెలుస్తుందనుకున్న సన్‌రైజర్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేయడంతో 6 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తడబడింది. బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైనా గ్లెన్ మ్యాక్స్‌వెల్(59), కెప్టెన్ విరాట్ కోహ్లీ(33) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన ఆర్సీబీ 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ 2 వికెట్లు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కేవలం ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. అయితే కెప్టెన్ వార్నర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ మనీష్ పాండే తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే వార్నర్ 54 పరుగులు చేసి ఔటైనా మ్యాచ్ ఇంకా సన్‌రైజర్స్ వైపే ఉంది. ఆ సమయంలో బెయిర్ స్టో ఔటవ్వడం, అప్పటి వరకు స్లో బ్యాటింగ్ చేసిన మనీశ్ పాండే కూడా ఔటవ్వడంతో ఆర్సీబీలో కాస్త ఆశలు చిగురించాయి. బౌలింగ్ మరింత కట్టుదిట్టం చేయడంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 9 బంతుల్లో 17 పరుగులు చేసిన అప్పటికే ఆలస్యమైపోయింది. చివరి ఓవర్లో 16 పరుగుల కావల్సి ఉండగా 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేసింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయడంతో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో షహబాజ్ నదీమ్ 3 వికెట్లతో అదరగొట్టగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు, కైల్ జేమీసన్‌ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండో విజయం సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.