ఐపీఎల్: పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్..!

Saturday, October 31st, 2020, 12:05:49 AM IST

ఐపీఎల్‌లో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వేయడమే కాకుండా, ప్లే ఆఫ్ ఆశలకు కూడా సజీవంగా ఉంచుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది మంచి ఫాంలో ఉన్న ఓపెనర్ మందీప్ సింగ్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌లో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఔటైనా గేల్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మరో పక్క పూరన్ కూడా వచ్చి రాగానే సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఇక పూరన్ ఔటయ్యాక ఆఖరి ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన గేల్ 99 పరుగులు చేశాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్ అవ్వడంతో గేల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైనా నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.

అనంతరం 186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా అలవోగా టార్గెట్‌ని చేధించింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్ అందరూ రెచ్చిపోయి ఆడడంతో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించారు. బెన్ స్టోక్స్ 50, సంజూ శామ్సన్ 48, స్టీవ్ స్మిత్ 31, రాబిన్ ఊతప్ప 30, జోస్ బట్లర్ 22 పరుగులతో ప్రతి ఒక్కరు రాణించారు.