కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి..!

Monday, October 26th, 2020, 11:43:49 PM IST


ఐపీఎల్‌లో నేడు కింగ్స్ ఎలవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టడంతో కోల్‌కతా భారీ స్కోర్ చేసే దిశగా కనిపించింది. అయితే తర్వాత వరుసగా వికెట్లు పడడంతో స్కోర్ బోర్డ్ నెమ్మదించింది. చివర్లో ఫెర్గ్యూసన్‌ హిట్టింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కోల్‌కతా 149 పరుగులు చేసింది.

అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అయితే తొలుత మన్‌దీప్ సింగ్ కాస్త తడబడినా ఆ తర్వాత అద్భుతంగా ఆడాడు. 56 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ 51 పరుగులు చెలరేగడంతో కేవలం 18.5 ఓవర్లలోనే 2 వికెట్లు పంజాబ్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వరుసగా 5 మ్యాచులు గెలిచిన పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.