డికాక్ మెరుపు ఇన్నింగ్స్.. ముంబై ఇండియన్స్ సునాయస విజయం..!

Friday, October 16th, 2020, 11:30:38 PM IST


ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు దూకుడు మరింత పెంచింది. నేడు కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై జట్ల మధ్య జరిగిన పోరులో సునాయస విజయం సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. 149 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 78 పరుగులు నాటౌట్, రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించారు. రోహిత్, సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన హిట్టర్ హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 20 పరుగులు చేయడంతో ముంబై మరో విజయం నమోదు చేసుకుంది.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 రన్స్ మాత్రమే చేయగలిగింది. నేడు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను మోర్గాన్‌కు అప్పగించారు. కమ్మిన్స్ 53 పరుగులు, కెప్టెన్ మోర్గాన్ 31 పరుగులు, శుభమాన్ గిల్ 21 పరుగులు తప్పా మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా విఫలమయ్యారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 148 పరుగులు మాత్రమే చేయగలిగింది.