మరోసారి ముంబై ఇండియన్స్‌దే కప్పు.. ఇది ఐదోసారి..!

Tuesday, November 10th, 2020, 11:45:37 PM IST


డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును గెలుచుకుంది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి తమ జట్టుకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుతో తలపడిన ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిబ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ 64 పరుగులు, రిషబ్ పంత్ 56 పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా విఫలమయ్యారు.

అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 51 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ 30 రన్స్ చేసి నాటౌట్‌గా నిలవగా, డికాక్ 20, సూర్యకుమార్ యాదవ్ 19, పొలార్డ్ 9 రన్స్ చేశారు. హిట్ మ్యాన్ రోహిత్ కెప్టెన్సీలో ముబై 2013, 2015, 2017, 2019, 2020లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఇక తొలిసారి ఫైనల్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచింది.