టీమిండియా బౌలర్ సిరాజ్‌పై మరోసారి జాతివివక్ష వ్యాఖ్యలు..!

Friday, January 15th, 2021, 08:24:02 PM IST

ఆస్ట్రేలియాలో టీమిండియా ప్లేయర్లకు జాతివివక్ష వ్యాఖ్యలు తప్పడం లేదు. గబ్బాలో నాలుగో టెస్టు జరుగుతున్న సందర్భంగా కొందరు ఆసీస్ అభిమానులు మళ్ళీ రెచ్చిపోయారు. టీమిండియా బౌలర్‌ మహ్మద్ సిరాజ్‌పై మరో సారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేశారు. అయితే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసినట్టు తెలుస్తుంది.

అయితే సిడ్నీలో జరిగిన మూడవ టెస్టు సందర్భంగా కూడా ఆసీస్ అభిమానులు భారత ఆటగాళ్ళపై జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తమ అభిమానుల తరపున టీమిండియా ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉంటే గబ్బా వేదికగా ఆసీస్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అయితే గ్రీన్ (28 నాటౌట్), టిమ్ పైన్ (38 నాటౌట్) ఇంకా క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో తొలి టెస్ట్ ఆడుతున్న నటరాజన్ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ఠాకూర్, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.