వీడియో వైరల్: సిడ్నీ టెస్టులో రోహిత్, గిల్‌లను విసిగించిన ఆసీస్ ఆటగాడు..!

Friday, January 8th, 2021, 11:32:24 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్లు అంటేనే స్లెడ్జింగ్‌కి మారుపేరు. తమ నోటికి పని చెప్పి ఇతర జట్ల ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడంలో వీరు ముందుంటారు. అయితే ఈ మధ్య ఆసీస్ ఆటగాళ్లు కాస్త నోటి దురుసు తగ్గించుకున్నారని అనుకునే లోపే మళ్ళీ వారు నోటికి పని చెప్పారు. తాజాగా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్ మార్న‌స్ ల‌బుషేన్‌ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు.

రెండో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సరదా ప్రశ్నలు, మాటలతో మార్నస్ లబుషేన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షార్ట్‌ లెగ్‌లో హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేసిన లబుషేన్ నీ ఫేవ‌రెట్ ప్లేయ‌ర్ ఎవ‌రు స‌చినా లేక కోహ్లీనా అంటూ గిల్‌ను అడిగాడు. త‌ర్వాత చెబుతాను అని గిల్ అంటున్నా ఆ వెంటనే సచినా? అని ప్రశ్నిస్తూ విరాట్ కోహ్లీని లెక్కలోకి తీసుకోవా అని అడిగాడు. అటు రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో క్వారంటైన్‌లో ఏం చేశావని ప్రశ్నించాడు. కానీ రోహిత్ అతని మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది.