ఐపీఎల్లో నేడు కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్ ద్వారా కోల్‌కతా ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ 36 పరుగులు, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 34 పరుగులు, నితీష్ రానా 29 పరుగులు, దినేష్ కార్తీక్ 29 పరుగులు, రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశారు.
అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు వార్నర్ 47 పరుగులు, జానీ బెయిర్ స్టో 36 పరుగులు, కేన్ విలియమ్సన్ 29 పరుగులు, డేవిడ్ వార్నర్ 28 పరుగులు, అబ్దుల్ సమద్ 23 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 163 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్ళింది.
అయితే సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 3 బంతులకే రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటయింది. పెర్గుసన్ తన మొదటి బంతికే వార్నర్‌ను బోల్డ్ చేయగా రెండో బంతికి సమద్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి సమద్‌ని కూడా ఔట్ చేశాడు. అనంతరం కోల్‌కతా జట్టు నుంచి దినేశ్ కార్తీక్, మోర్గాన్ బ్యాటింగ్‌కి వచ్చారు. రషీద్ ఖాన్ బౌలింగ్ చేయగా మొదటి బంతి డాట్ అయ్యింది. రెండో బంతికి మోర్గాన్ సింగిల్ తీయగా, మూడో బంతి డాట్ అయ్యింది. నాలుగో బంతికి దినేశ్ కార్తీక్ రెండు పరుగులు చేయడంతో కోల్‌కతా విజయ భేరీ మోగించింది.