ఐపీఎల్: ఎట్టకేలకు రెండో విజయం సాధించిన పంజాబ్..!

Thursday, October 15th, 2020, 11:46:14 PM IST


ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ముందు నుంచి లక్ కలిసి రాని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఎట్టకేలకు రెండో విజయం దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 48 పరుగులు, క్రిస్ మోరిస్ 25, శివం దుబే 23, అరోన్ ఫించ్ 20 పరుగులతో రాణించారు.

అయితే 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. మయాంగ్ అగర్వాల్ 45 పరుగులు చేసి ఔట్ అయినా, కెప్టెన్ కేఎల్ రాహుల్ 61, క్రిస్ గేల్ 51 పరుగులు చేయడంతో విజయం సులువయ్యింది. అయితే చివరి రెండు బంతులు ఉండగా క్రిస్ గేల్ రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ జరుగుతుందా అని అనిపించింది. అయితే ఒక బంతిలో ఒక్క పరుగు చేయాల్సిన సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన నికోలస్ పూరన్ సిక్స్ కొట్టడంతో పంజాబ్ విజేతగా నిలిచింది.