తొలి టీ20లో అదరగొట్టిన ఇంగ్లాడ్.. టీమిండియాకు తప్పని ఓటమి..!

Saturday, March 13th, 2021, 12:15:56 AM IST

అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమిపాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లో మెరిసిన ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ 67 పరుగులతో రాణించగా, హార్దిక్ పాండ్యా 21 పరుగులు, రిషబ్ పంత్ 21 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ అందరూ ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు జేసన్ రాయ్ 49 పరుగులు, జోస్ బట్లర్ 28 పరుగులతో చక్కటి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు ఔటయ్యాక వచ్చిన డేవిడ్ మలాన్ 24 పరుగులు, జానీ బెయిర్ స్టో 26 పరుగులు చేయడంతో భారత్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లోనే చేధించింది. దీంతో 5 టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యం సాధించింది.