ముంబై జట్టును మాయ చేసిన అమిత్ మిశ్రా.. ఢిల్లీ సూపర్ విక్టరీ..!

Wednesday, April 21st, 2021, 12:34:48 AM IST

ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కి దిగిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను కుప్పుకూల్చాడు. మరో పేసర్ అవేశ్ ఖాన్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (44), ఇషాన్ కిషన్ (26), సూర్యకుమార్‌ యాదవ్‌ (24), జయంత్ యాదవ్ (23) మినహా మిగతా వారెవరు రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై జట్టు కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం 139 పరుగుల స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా(7) పరుగులకే ఔటైనా శిఖర్ ధవన్(45) పరుగులతో మరోసారి రాణించాడు. ఇక స్టీవ్ స్మిత్(33) పరుగులతో ఆకట్టుకున్నాడు. లలిత్ యాదవ్(22 నాటౌట్), రిషభ్ పంత్(7), హెట్మెయర్(14 నాటౌట్) కలిసి మిగతా లాంఛనాన్ని పూర్తిచేశారు. దీంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ముంబై బౌలర్లలో బుమ్రా, రాహుల్ చాహర్, పొలార్డ్, జయంత్ యాదవ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఢిల్లీ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, ముంబై రెండో ఓటమిని మూటగట్టుకుంది.