మెరిసిన చెన్నై ఓపెనర్లు.. సన్ రైజర్స్‌కు తప్పని ఓటమి..!

Thursday, April 29th, 2021, 12:00:14 AM IST

ఐపీఎల్ 2021లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఫాంలో ఉన్న జానీ బెయిర్‌స్టో (7) పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57), మనీష్ పాండే (61) అర్ధసెంచరీలతో కదం తొక్కడం, చివర్లో కేన్ విలియమ్సన్ కేవలం (26) రాణించడంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా, సామ్ కరన్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు డుప్లెసిస్(56), రుతురాజ్ గైక్వాడ్(75)ల జోరుకు సన్ రైజర్లు బౌలర్లు చేతులేత్తేశారు. అయితే రషీద్ ఖాన్ పుంజుకుని క్రీజులో కుదురుకున్న ఒపెనర్లు గైక్వాడ్, డుప్లెసిస్‌తో పాటు మొయీన్ అలీ(8)ని పెవిలియన్ చేర్చిన అప్పటికే మ్యాచ్ సన్‌రైజర్స్ చేయి ధాటిపోయింది. చివర్లో సురేష్ రైనా (17), రవీంద్ర జడేజా (7) కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.