ఐపీఎల్-2021: వేలానికి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్..!

Saturday, February 6th, 2021, 02:13:27 AM IST


ఐపీఎల్ 2021 వేలం కోసం రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 18న చెన్నైలో జరగనున్న వేలానికి భారీ సంఖ్యలో ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అన్ని ఫ్రాంచైజీలు కలిపి అత్యధికంగా 61 మందిని మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉండగా 1097 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఇందులో 814 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, 283 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సైతం తొలిసారిగా వేలం కోసం రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును నమోదు చేసుకున్నాడు. 21 ఏళ్ల అర్జున్ అండర్-19 టోర్నీలలో దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ, దేశవాళీ టోర్నీలలో ఆడకపోవడంతో గత ఐపీఎల్‌ సీజన్‌లలో పేరు నమోదు చేసుకునేందుకు అర్హత లభించలేదు. అయితే ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ ముంబైకి ప్రాతినిధ్యం వహించడంతో ఈ సారి ఐపీఎల్‌ వేలానికి అర్హత సాధించాడు.