సమీక్ష : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ ప్రధాన పాత్రలలో స్వరూప్ ఆర్ జె ఎస్ దర్శకత్వంలో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ ఎలావుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

కథ:
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) చిన్న చిన్న కేసుల విషయంలో పోలీస్ లకు సహాయం చేస్తూ తన జీవితం గడుపుతూ ఉండే ఒక చిన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్. ఈ క్రమం లో అనుమానాస్పదంగా రేప్ చేసి చంపబడిన ఓ యువతి మర్డర్ కేసు ని పరిష్కరించే అవకాశం ఇతనికి వస్తుంది. ఆ అమ్మాయి చావు వెనుక వున్న అసలు నేరస్థులు ఎవరు? ఆత్రేయ ఆ నేరస్థులను పెట్టుకున్నాడా? ఇలాంటి ఉత్కంఠ రేపే మర్డర్ వెనుక మిస్టరీ ఏమిటో తెరపైన చూడాలి.

విశ్లేషణ:
మొదటి మూవీ అయినా కూడా దర్శకుడు స్వరూప్ ఎంచుకున్న కథ,అలాగే చెప్పిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఆయన స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి ప్రతి క్షణం ఉత్కంఠను ఫీల్ అయ్యేలా చేస్తుంది. అలాగే దర్శకుడు హాస్యాన్ని సీరియస్ నెస్ ని మిక్స్ చేసి కథను నడిపించడంలో విజయం సాధించారు. ఈ మూవీ చుసిన తరువాత టాలీవుడ్ కి ఓ మంచి దర్శకుడు దొరికిన భావన కలుగుతుంది.
ఇక హీరో నవీన్ పోలిశెట్టి తన నటనతో సినిమాకి ఊపిరి పోసాడు. సినిమా మొత్తం తన భుజాలపై మోసాడనిపిస్తుంది. నటన పరంగా,అలాగే కామెడీ టైమింగ్ చక్కగా పర్ ఫామ్ చేసాడు . అతని డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు చక్కగా ఉపయోగపడింది. ఇక హీరోయిన్ శృతి శర్మ తన పాత్ర పరిధిలో చక్కగా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫేమ్ సుహాస్,సుదీప్ ప్రధాన పాత్రలలో వారి నటన బాగుంది.

ప్లస్ పాయింట్స్:

నవీన్ పోలిశెట్టి
కథలో సస్పెన్సు
కథనం
మైనస్ పాయింట్స్:

చివరి 30 నిమిషాలు
ప్రేక్షకులకు పరిచయం లేని ఫార్మాట్.

తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఆసక్తి కరంగా సాగే వినోదంతో కూడిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా. హీరో నవీన్ పోలిశెట్టి అంతా తానై మూవీని చక్కగా నడిపించాడు. దర్శకుడు స్వరూప్ ఎంచుకున్న కథ, కథనం నడిపించే విధానం ప్రేక్షకుడికి మంచి అనుభూతి ఇస్తాయి. కాబట్టి ఈ మూవీ ఈ వీక్ ఎండ్ కి మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.

Rating : 3.5/5