నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో వైసీపీ.. లాభమెవ్వరికి.. నష్టమెవ్వరికి..!

Friday, March 26th, 2021, 07:04:44 PM IST

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి చూపు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక వైపు మళ్ళింది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి జానా రెడ్డి బరిలో నిలవబోతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇటీవల జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తన ఖాతాలో వేసుకున్న అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని భావిస్తుంది. ఆశావాహులు చాలా మంది టికెట్ ఆశిస్తున్నా ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థి ఎవ్వరన్నది టీఆర్ఎస్ ప్రకటించలేదు. ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈ స్థానంలో కూడా పాగా వేయాలని భావిస్తుంది. అయితే ఈ పార్టీ నుంచి కూడా చాలా మంది టికెట్ ఆశిస్తున్నా ఎవరిని బరిలో నిలిపితే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న దానిపై బీజేపీ కసరత్తు చేస్తుంది.

అయితే టీఆర్‌ఎస్‌, బీజేపీలు వేస్తున్న ఎత్తుగడలే రాజకీయంగా చర్చకు కారణం అవుతున్న సమయంలో అనూహ్యంగా వైసీపీ నుంచి ఓ అభ్యర్థి నామినేషన్‌ వేయడం ఇప్పుడు చర్చాంశనీయమయ్యింది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపని వైసీపీ సాగర్‌ ఎన్నికల్లో పోటీకి దిగడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయితే వైసీపీ బరిలో నిలిస్తే ఓట్లు చీలే అవకాశం ఉందని అది టీఆర్ఎస్‌కే ఎక్కువ కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.