పోస్ట్ వైరల్: వైసీపీలో దుమారం రేపుతున్న గజ్జల లక్ష్మి వివాదం..!

Tuesday, November 10th, 2020, 02:00:40 AM IST

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ప్రస్తుతం ఓ పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గజ్జల లక్ష్మి ఎంతో ఆవేదన చెందుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టగా అది కాస్త వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే “ఒక్కోసారి చాలా బాదగా అనిపిస్తుంది. 11 సంవత్సరాలు నిస్వార్ధంగా పార్టీకి సేవలందించాం కానీ నాయకుల అటెండర్ కూడా గౌరవంగా చూడరు. అధికారం వస్తే ఇలా మనుషులు మారుతారని తెలియని మూర్ఖత్వం చచ్చేదాకా ఈ అభిమానం తగ్గదేమో అందుకే మన బ్రతుకుదెరువు కోసం కొద్ది రోజులు ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, తప్పదు ప్రాణం ఉంటేనే పోరాడగలం అని పోస్ట్ పెట్టారు.

అంతేకాదు ఇప్పటి వరకు పార్టీకి శారీరకంగా చాలా శ్రమించాను, ఆర్థికంగా నా పరిధిలో ఖర్చు పెట్టాను, ఒక్క పైసా కూడా ఎవరి సొమ్ము తినలేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఒక పని మీద ఒక నాయకుడిని కలిసేందుకు వెళ్ళానని, ఆ నాయకుడి పీఎ చాలా అగౌరవంగా మాట్లాడుతూ అందరి ముందు అవమానపరిచాడని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే జగన్ అధికారంలోకి రావాలని పరితపించిన వాళ్లలో గజ్జల లక్ష్మి ఒకరు. అయితే పార్టీపై, జగన్‌పై ఆమెకున్న అభిమానంతో ప్రత్యర్ధి నాయకులు మాట్లాడే మాటలకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు. అయితే ఇంత యాక్టివ్‌గా ఉండే గజ్జల లక్ష్మిని అవమానించింది ఎవరో కాదట టీటీటీ ఛైర్మన్‌గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పీఎ అని తెలిసింది.

అయితే దీనిపై ఆమె క్లారిటీ కూడా ఇచ్చుకుంది. తనను ఛైర్మన్ వౌవి సుబ్బారెడ్డి గారు ఏమీ అనలేదని, ఆయన పీఎ ఒక్కరే అగౌరవంగా మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఇక ఈ గొడవకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా ఈ విషయాన్ని పార్టీకి ముడేసి తప్పుదోవ పట్టించకడని తనకు వైసీపీ పార్టీ అన్నా, జగన్ అన్నా ఎప్పటికి ప్రాణమని అన్నారు.