నేటిఏపి విశ్లేషణ : ఖమ్మం ఖిల్లాలో వైకాపా పాగా

Saturday, May 17th, 2014, 12:57:01 PM IST


2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16వ తేది శుక్రవారంనాడు వెలువడ్డాయి. అయితే ఫలితాల ముందు వరకు మీడియా దగ్గర నుండి రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు అనే తేడ లేకుండా ఎవరు పడితే వారు తన గణాంకాలను లెక్కలు కట్టి ఈ పార్టీ వస్తుందంటే ఆ పార్టీ వస్తుందని తమ జోతిష్య పాటవాన్ని బయటపెట్టాయి. అయితే తాజాగా వెలువడిన ఫలితాలలో కేంద్రం విషయంలోను తెలంగాణా విషయంలోనూ వీరందరి జోస్యాలు ఫలించాయనే చెప్పాలి. అందరు అనుకున్నట్లుగానే కేంద్రంలో మోడీ హవా కొనసాగి భాజపా తిరులేని విజయాన్ని కైవసం చేసుకోగా, తెలంగాణాలో తెరాస పార్టీ అధినేత కెసిఆర్ తన సత్తా చూపించారు. ఇక సీమాంధ్రలో టిడిపి నేత చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పోటాపోటీ యుద్ధం జరుగుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపధ్యంలో అందరి అంచనాలను మించి తెలుగుదేశం పార్టీ ఆంద్రప్రాంతంలో తిరుగులేదనిపించుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ తో వచ్చిన వైకాపా పార్టీ కొత్త పార్టీ అయినా కూడా సీమాంధ్ర ఫలితాలలో చంద్రబాబుకు గట్టి పోటీని ఇచ్చి కొన్ని స్థానాలను దక్కించుకుంది. అయితే సీమాంద్రలో వైకపా పార్టీకి ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే, కాని ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఎటువంటి స్థానబలం లేని తెలంగాణా ఖమ్మం జిల్లాలో వైకాపా ఎంపి స్థానాన్ని, రెండు అసంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దానితో ఈ విషయం పై సర్వత్రా రాజకీయవర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి .

అయితే ఖమ్మంలో 2014 లోక్ సభ ఫలితాలను పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ , టిడిపి , తెరాస , సిపిఐ , ఇండిపెండెంట్లు, జై సమైఖ్యాంద్ర పార్టీ, పిపిఐ, బిఎస్పి మరియు ఇతరులు మొదలగు పార్టీలు ఖమ్మంలో ఎంపి స్థానానికి పోటీ పడ్డారు. అయితే అందరి అంచనాలను మించి వైఎస్సార్ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 91,786 ఓట్లతో ఆధిక్యాన్ని సాధించారు. అటుపై రెండో స్థానంలో 89, 571 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ది నామా నాగేశ్వరరావు నిలిచారు. 43,358 ఓట్లలో తెరాస అభ్యర్ధి బయిగ్ షేక్ మూడవ స్థానంలో ఉన్నారు. ఇక సిపిఐ అభ్యర్ధి కంకణాల నారాయణ 38,221 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే ఖమ్మం స్థానిక ఎన్నికలలో తన సత్తా చూపించిన టిడిపి సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. ఇక ఖమ్మం లోక్ సభ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే 1962వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల నుండి 1996 ఎన్నికల వరకు అనగా వరుసగా 8 సార్లు జరిగిన ఎన్నికలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్ధులే గెలుపొందారు. 1996 ఎన్నికలలో సిపిఎం ఖమ్మం ఎంపి స్థానాన్ని దక్కించుకోగా 1999, 2004 ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ తన హవాను కొనసాగించింది. అటుపై 2009 ఎన్నికలలో టిడిపి అభ్యర్ధి ఖమ్మం ఎంపి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మరి చరిత్రను పరిశీలిస్తే ఖమ్మం ప్రజలు వరుసగా కాంగ్రెస్ అభ్యర్ధులకు ఎంపి స్థానాన్ని కట్టబెట్టడం చూస్తుంటే ఆ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అంటే వల్లమానిన అభిమానమని చెప్పకనే తెలుస్తోంది. అయితే మారిన తాజా పరిణామాల రీత్యా ఎందుచేతనో మరి అక్కడి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపలేదని అనిపించకమానదు.

అలాగే ఖమ్మంలో వైకాపా అభ్యర్ధులు పినపాక నియోజకవర్గం నుండి పి వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నియోజకవర్గం నుండి టి వెంకటేశ్వర్లు రెండు అసంబ్లీ స్థానాలను దక్కించుకున్నారు. అయితే కాంగ్రెస్ మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పధకాలు, ఆయన అకాల మరణం వంటి అంశాలు ఖమ్మం ప్రజల సానుభూతిని పొందడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఖమ్మంలోని రెండు వర్గాల మధ్య పోరు కూడా అక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఎంపి నామా నాగేశ్వరరావు పరాజయానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం కోటలో పాగా వేసిన పటిష్టమైన పార్టీ సిపిఎం అభ్యర్ధి నారాయణ కూడా వేరే ప్రాంతంవారు కావడం, వారిలో వారికి అంతర్గత కలహాలు రావడం వంటి అంశాల రీత్యా గెలుపును నమోదు చేసుకోలేకపోయారు. ఇంకా ఖమ్మంలో జగన్ ఓదార్పు యాత్రలు, కుల ప్రాతిపదిక పైన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహద పడి ఉంటాయని రాజకీయ పెద్దలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణాలోని ఖమ్మంలో స్థానబలం లేని వైకాపా పార్టీ నుండి పోటీ చేసి ఎంపి స్థానాన్ని, ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందిన ఆ పార్టీనేతలకు సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.