స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలి.. అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీలు..!

Saturday, February 13th, 2021, 02:00:44 AM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను నేడు వైసీపీ ఎంపీలు కలిశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని అమిత్‌షాకు ఎంపీలు వినతి పత్రం ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ కార్యదర్శికి కూడా వైసీపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో సీఎం జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరినట్టు వీరు మీడియా సమావేశం ద్వారా తెలిపారు.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీకి ఇదివరకే సీఎం జగన్ లేఖ రాశారు. తెలుగు ప్రజల పదేళ్ల పోరాట ఫలితంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటైందని, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఆనాడు చేసిన ప్రజా ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్‌ను లాభాల బాట పట్టించేందుకు, ప్లాంటును బలోపేతం చేసే మార్గాలు అన్వేషించాలని సీఎం జగన్ లేఖలో ప్రధాని మోదీనీ కోరిన సంగతి తెలిసిందే.