జగన్ లేఖకే దిక్కు లేదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, June 3rd, 2020, 10:45:50 PM IST


సీఎం జగన్ ఏడాది పాలనపై స్పందించిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈ ఏడాదిలో తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే గతంలో తాను అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలకు మంత్రిగా పనిచేశానని తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు అందేవి తప్పా, మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని ఆనం తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఇలాంటి అద్వాన్నపు అధికార యంత్రాంగాన్ని తానెన్నడూ చూడలేదని అన్నారు. ఇదిలా ఉంటే జలవనరుల శాఖలో అధికారులే నీళ్ళు అమ్ముకుంటున్నారంటూ, మంత్రులకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డీపీఆర్ లు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గతంలో కూడా నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతుందని ఆనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.