సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రోజా సీరియస్.. కారణం అదే?

Wednesday, March 10th, 2021, 04:45:11 PM IST

MLA_Roja

మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరోసారి సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో నేడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. తన నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఓటమికి కొందరు నేతలు పనిచేశారని ఆరోపించారు. టీడీపీ గెలిచినా పర్వాలేదని 14 మంది రెబల్స్‌ని నగరి మరియు పుత్తూరులో బరిలోకి దింపారని ఆమె చెప్పుకొచ్చారు.

అంతేకాదు వారి గెలుపు కోసం పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారని, గత ఎన్నికల్లో నా ఓటమికి పనిచేసిన వారే మళ్ళీ ఈ పని చేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వాళ్లంతా వైసీపీలో వెన్నుపోటు దారులు అని, ఇలాంటి వారిని వైసీపీ హైకమాండ్ గుర్తించాలని రోజా అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే సాక్ష్యాధారాలతో సహా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని బయటపెట్టి వారిపై వేటు పడేలా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా నగరి మరియు పుత్తూరులో వైసీపీ గెలవడం గ్యారంటీ అని రోజా అన్నారు.