కడుపులో మంట బయటపెట్టుకున్నాడు… చంద్రబాబుపై రోజా మండిపాటు..!

Wednesday, January 13th, 2021, 03:12:41 PM IST

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగి పండుగ సందర్భంగా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసిన రోజా చంద్రబాబుపై పంచులు వేశారు. ప్రజలు భోగి మంటలు వేసుకుంటే, చంద్రబాబు మాత్రం తన కడుపులో మంట బయటపెట్టారని అన్నారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబు బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

అయితే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని రోజా అన్నారు. రైతులకు వ్యతిరేకంగా జీవోలు వచ్చాయని, వాటిని మంటల్లో తగలబెట్టడం చూస్తుంటే చంద్రబాబు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందన్నారు. రైతే రాజన్న విధంగా రైతు అడిగినవి, అడగనవి కూడా చేసి రైతుకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.