వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఆ పంచాయితీ జనసేన ఖాతాలోకి..!

Thursday, February 18th, 2021, 02:07:01 AM IST


ఏపీ పంచాయితీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలానికి చెందిన నీలిపూడి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్‌ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్ఈసీ ఆయనపై ఆంక్షలు విధించడం, ఆయన కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవడం వంటివి జరిగాయి. అయితే ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలే అక్కడ వైసీపీ కొంపముంచింది. నీలిపూడి గ్రామంలో 10 వార్డులు ఉండగా అన్నింటిని జనసేన మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. అంతేకాదు సర్పంచ్ స్థానాన్ని కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థే గెలుచుకుంది. ఆ గ్రామంలో మొత్తం 1,408 ఓట్లు ఉండగా అందులో వెయ్యికి పైగా ఓట్లు జనసేన బలపరిచిన అభ్యర్థి పాశం కృష్ణకు రాగా, 270 ఓట్ల వైసీపీ మద్దతుదారులకు పోలైనట్టు తెలుస్తుంది.