ఆ లేఖ నా వ్యక్తిగతం.. వైసీపీ ఎమ్మెల్యే భూమన క్లారిటీ..!

Monday, August 31st, 2020, 08:28:32 AM IST

విరసం నేత వరవరరావును విడుదల చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తాను రాసిన లేఖ వ్యక్తిగతమని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వరవరరావు వయసులో పెద్దవారని కరోనా వంటి పరిస్థితులలో ఆయనను ఇబ్బంది పెట్టకుండా క్షమించి విడుదల చేయాలని తాను అభిప్రాయపడ్డానని ఇదే విషయాన్ని లేఖలో పేర్కొన్నానని దీనిని మా ముఖ్యమంత్రి జగన్‌కి ముడిపెట్టడం బాధతో పాటు నవ్వు తెప్పిస్తుందని అన్నారు.

ఈ మేరకు బీజేపీ ఏపీ ఇంచార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ ట్వీట్‌పై స్పందించి ఆయనకు లేఖ రాశారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదని, 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై నక్సల్స్‌ దాడిచేస్తే కాంగ్రెస్‌ నేతగా తాను ఆ దాడిని ఖండిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం ముందు నిరసన తెలిపానని చెప్పుకొచ్చారు. 46 ఏళ్ల క్రితం వరవరరావు, వెంకయ్య, తాను జైలులో కలిసి ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా ఉపరాష్ట్రపతికి లేఖ రాశానని అన్నారు.