ఆ అంచనాలన్ని తప్పే.. పవన్‌తో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి ఆవేదన..!

Thursday, December 3rd, 2020, 03:00:27 AM IST

ఏపీలో ఇటీవల సంబవించిన నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తొలిరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ రైతులలో భరోసా నింపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన వారికి అక్కడి ప్రభుత్వం పది వేల సాయం ప్రకటించిందని, అయితే ఏపీలో ఎకరం పొలం వర్షాలకు పడిపోతే జగన్ ప్రభుత్వం కూడా అదే పదివేలు ఇస్తామనడం సరికాదని, అయితే ఎకరాకు కనీసం 25వేల నుంచి 30 వేల వరకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

అయితే రైతులను పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్‌ను వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ పెదరెడ్డయ్య కలిశారు. నివర్ తుఫాన్ కారణంగా అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలన్నీ తప్పులేనని పెదరెడ్డయ్య పవన్‌తో అన్నారు. అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని పవన్ కళ్యాణ్ చెప్పగా దానికి తాను కూడా వస్తానని పెదరెడ్డయ్య చెప్పాడు. అయితే ఇదంతా బాగానే ఉన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే తండ్రి ఇలా పవన్‌ని కలిసి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.