అలా చేయొద్దు.. జగన్ సర్కార్‌కి వైసీపీ ఎమ్మెల్యే సజేషన్..!

Wednesday, July 8th, 2020, 06:00:39 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావిస్తుంది. దీంతో కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

అయితే కొన్ని ప్రాంతాలలో తమ ప్రాంతాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలంటూ నేతల నుంచి ప్రభుత్వానికి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు జిల్లాల పునర్విభజనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ యోచన సరికాదని, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ లేని శ్రీకాకుళం జిల్లాను ఊహించుకోలేమని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని అయితే జిల్లాల ఏర్పాటు చేసే ముందు ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని సూచించారు. అయితే ధర్మాన వ్యాఖ్యలను స్పీకర్ కూడా సమర్ధించారు.