పవన్ ఓ స్టేట్‌ రౌడీ.. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!

Saturday, February 27th, 2021, 07:26:49 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఓ స్టేట్‌ రౌడీ అని, జనసైనికులు ఆకురౌడీలు అని ఇది మీ పేటెంట్ హక్కు అంటూ దుయ్యబట్టారు. పార్టీ పెట్టి అవగాహనా లోపంతో, అజ్ఙానంతో పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. పవన్‌కు మానసిక వ్యాధి ఉందని, మానసిక రోగంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని అన్నారు. నన్ను పిచ్చి కుక్కల వ్యాన్‌లో వేసి పంపుతానని పవన్ మాట్లాడారని, అసలు రెండు చోట్ల ప్రజలు అదే వ్యాన్‌లో మిమ్మల్ని వేసి పంపించారని గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వీరవాసరం మండలం మత్యపురి గ్రామ సర్పంచ్ పదవిని జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారు. ఈ క్రమంలో విజయోత్సవ ర్యాలీలో జనసేన, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడంతో పవన్ కూడా అందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకురౌడీ అని, కోపరేటివ్ బ్యాంకులో సొమ్ము దాచుకునే చిన్నచితకా శ్రమజీవులను దోచేసిన వ్యక్తి అని పవన్ అన్నారు. అంతేకాదు పిచ్చికుక్క కరిస్తే తిరిగి కరవకూడదని, మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేవరకు ఆగాలని, త్వరలో మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది.. పిచ్చికుక్కని పట్టుకెళ్తుందని చెప్పుకొచ్చారు. మా వాళ్ల తప్పుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సరిదిద్దుకుంటామని, అలా కాదని జనసైనికులపై వారి ఇళ్లపై దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని పవన్ హెచ్చరించారు.