అధికారులపై క్రిమినల్ కేసులు పెడతా.. వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్..!

Thursday, January 28th, 2021, 02:00:09 AM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేల పాత్ర ప్రహసనంగా మారితే ఎలా అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గతేడాది కూడా ఇదే రకంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని, తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని ప్రజల కోసం ఎవరినైనా నిలదీస్తానని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు తప్పా మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని వాపోయారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆనం అసంతృప్తి వ్యక్తం చేశారు.