నిమ్మగడ్డ లక్ష్యం అదే.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!

Sunday, January 24th, 2021, 01:22:42 AM IST


ఏపీ పంచాయితీ ఎన్నికల రచ్చ మరింత తీవ్రతరమయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికి ఈ రోజు ఉదయం తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అనంతరం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిమ్మగడ్డ భావించినా అధికారులు ఎవరూ ఈ సమావేశానికి హాజర్ కాలేదు. అయితే దీనిపై నిమ్మగడ్డ ఎలాంటి చర్య తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగస్తులకు కరోనా సోకి చనిపోతే వారి కుటుంబానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. తన పదవి కాలం అయిపోయేలోపు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఎన్నికలను వాయిదా వేయమంటున్నాము కానీ ఎన్నికలు అంటే భయంతో మాత్రం కాదని అన్నారు. నిమ్మగడ్డ, చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో ఉంటారని ప్రజలు, ఉద్యోగుల సమస్యలు వారికి పట్టవని అన్నారు.