అక్రమ మైనింగ్ ఆరోపణలపై అంబటి రాంబాబు క్లారిటీ..!

Friday, August 28th, 2020, 12:15:09 PM IST

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్నారన్న అరోపణలు వస్తుండడంతో వాటిపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అక్రమ మైనింగ్‌కు ప్రయత్నం చేసి విఫలమైనవారే, పిల్ వేసి నన్ను అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై వ్యతిరేక మీడియా, ప్రత్యర్థి రాజకీయపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని, అక్రమాలకు, అవినీతికి పాల్పడే ప్రశ్నయే లేదని, వాస్తవాలు నిదానంగా బయటకొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఈ విషయాన్ని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని వారు పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్ అధికార పార్టీకి చెందిన వారే పిటిషన్ దాఖలు చేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో వెంటనే పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసును వచ్చే నెలకు వాయిదా వేసింది.