జగన్ గన్‌లో బుల్లెట్ లేకపోతేనే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడా – అంబటి

Saturday, February 27th, 2021, 07:46:12 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గన్‌లో బుల్లెట్ లేకపోతేనే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడా? అని పేర్కొన్నారు. గన్ లో బుల్లెట్ లేకపోతేనే టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యిందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల కుమారులు అందరూ ముఖ్యమంత్రులు కాలేరని, లోకేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమయ్యే పని కాదని అన్నారు. భువనేశ్వరి అయినా కొడుకు మానసిక స్థితిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

అయితే పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు చంద్రబాబు కుప్పం గల్లీలు పట్టుకుని తిరుగుతున్నాడని, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తాను పులివెందులకు నీళ్లిచ్చాను, ఇప్పుడు మీరు కుప్పానికి నీళ్లివ్వండి అనడం అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏమి చేశారని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలని అడుగుతున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల పేరుతో పచ్చకాగితాల మేనిఫెస్టో రిలీజ్ చేశారని, అధికారంలో ఉన్నప్పుడే మ్యానిఫెస్టోలను అమలు చేయని చంద్రబాబు, ప్రతిపక్షంలో ఈ కొత్త మ్యానిఫెస్టో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.