హాట్ టాఫిక్: వైఎస్ షర్మిలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!

Thursday, February 11th, 2021, 06:12:08 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేడు ఆమెను కలవడం హాట్ టాఫిక్‌గా మారింది. లోటస్ పాండ్‌లోని జగన్ నివాసంలో షర్మిలతో అళ్ల రామకృష్ణారెడ్డి దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు.

అయితే వైఎస్ జగన్‌కు సన్నిహితుల్లో ఒకరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి షర్మిలతోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున షర్మిల కూడా ప్రచారం చేశారు. అయితే సీఎం జగన్ చెప్పడం వల్లే ఆళ్ల షర్మిలతో చర్చలు జరిపారా? లేక షర్మిలతో తనకున్న పరిచయం కారణంగానే కలిసేందుకు వచ్చారా అనే దానిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇవ్వన్ని పక్కనపెడితే తెలంగాణలో షర్మిల రాజకీయ కార్యాచరణకు తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ప్రకటించిన తర్వాత అసలు షర్మిలతో ఆళ్ల ఎందుకు భేటీ అయ్యారు, ఏం మాట్లాడారన్న అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మొన్న నల్గొండ జిల్లాల నేతలతో సమావేశమైన షర్మిల నేడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.