అలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. వైసీపీ మంత్రి సవాల్..!

Tuesday, September 15th, 2020, 05:30:50 PM IST

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాంపై గత కొద్ది రోజులుగా భూ కభ్జాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఆస్పరి ఇత్తిన భూముల వివాదంపై నేడు మీడియాతో మాట్లాడిన మంత్రి గుమ్మనూరి జయరాం తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వాటిపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఆస్పరిలో తాను భూములు కొన్నమాట వాస్తవమే అని మంజునాథ అనే వ్యక్తి నాకు భూములు అమ్మారని అన్నారు.

అయితే ఆ భూములపై ఆలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విచారించగా క్లియర్ టైటిల్ అనటంతోనే తాము కొన్నామని అంతేకానీ దౌర్జన్యం చేసి తీసుకోలేదని అన్నారు. నా జీవితంలో కుట్రలు కుతంత్రాలు లేవని, కబ్జాలకు పాల్పడే వ్యక్తిని కాదని అన్నారు. టిష్యూ పేపర్లో వచ్చే వార్తల గురుంచి పట్టించుకోనవసరం లేదని వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నన్ను ఎవరైనా ఖబ్జాదారుడని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.