చంద్రబాబు సవాల్‌కు వైసీపీ ప్రతి సవాల్.. ఏది కుదరని పనే..!

Sunday, August 9th, 2020, 02:17:01 AM IST


ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం విశాఖకు తరలించే విషయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, వైసీపీ గెలిస్తే రాజధాని తరలింపును తాము అడ్డుకోబోమని ఈ సవాలుపై స్పందించేందుకు వైసీపీ ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే చంద్రబాబు సవాల్‌ను వైసీపీ అసలు స్వీకరించలేదు. తాజాగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ ప్రజలు అంటే తనకెంతో ఇష్టమని చెప్పే చంద్రబాబు మూడు సార్లు అధికారంలో ఉండి విశాఖకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. విశాఖకు రాజధాని అవసరమో కాదో తేల్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అయితే అవంతి సవాల్‌పై చంద్రబాబు ఇంకా స్పందించలేదు. ఏదేమైనా అటు చంద్రబాబు, ఇటు అవంతి సవాల్ ఏదీ కుదరని పనే అని చెప్పాలి.