తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన వైసీపీ..!

Wednesday, March 17th, 2021, 01:14:21 AM IST


తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు నేడు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 23 నుంచి 30వ తేది వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఉప ఎన్నికకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లుగానే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్.ఎం.గురుమూర్తి పేరును ఖరారు చేసింది. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు ఫిజియోథెరపిస్టుగా గురుమూర్తి పనిచేశారు. సౌమ్యుడిగా గురుమూర్తికి మంచి పేరు ఉండడంతో ఉపఎన్నికలో గురుమూర్తిని గెలిపించి పార్లమెంటుకు పంపేందుకు సీఎం జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక టీడీపీ ఇప్పటికే మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును అధికారికంగా ప్రకటించగా, బీజేపీ-జనసేన మద్ధతులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. గత ఏడాది కరోనా బారిన పడి బల్లి దుర్గా ప్రసాద్ మరణించారు. అయితే తొలుత ఉప ఎన్నికలో ఆయన కుమారుడికే టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ అనూహ్యంగా ఆలోచించి బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు.