ఇంట్రెస్టింగ్: రేవంత్ రెడ్డి సభకు హాజరైన వైఎస్ సన్నిహితుడు సూరీడు..!

Wednesday, February 17th, 2021, 01:27:49 AM IST


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ల నుంచి మద్ధతు లభించకపోయినా ఎవరూ ఊహించని వ్యక్తి మాత్రం ఈ సభకు హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు.

అయితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు సభా వేదికపై తళుక్కున మెరిశారు. రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫోటో దిగారు. రాజశేఖర్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా సూరీడు వెంటే ఉండేవాడు. అయితే వైఎస్సార్ మరణానంతరం సూరీడు ఆ కుటుంబానికి కాస్త దూరమయ్యాడు. ఆ తర్వాత మీడియాలో కూడా ఆయన పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న సభలో ప్రత్యక్షం అవ్వడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.