బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై వైఎస్ షర్మిల సీరియస్ కామెంట్స్..!

Friday, March 26th, 2021, 03:56:39 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల అందుకు తగ్గట్టుగానే వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల అనుచరులతో వరుసగా భేటీ అవుతున్న షర్మిల తాజాగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానుల‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “రాజన్న కోసం నేను నిలబడతా.. తెలంగాణ ప్రజల కోసం నేను పోరాడుతా” అని వ్యాఖ్యానించారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ ఆదిలాబాద్ జిల్లా అని, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరామ్ పుట్టిన గడ్డ మన అదిలాబాద్ అని అన్నారు.

అయితే పోడు భూములకు పట్టాలు ఇచ్చి లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్సార్ అని గుర్తు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్‎కి తలమానికమన్నారు. బాసరలో ట్రిపుల్ ఐటీ, నిజామాబాద్‎లో యూనివర్సిటీని వైఎస్సార్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశంలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ నెంబర్ వన్ అని నిజామాబాద్ జిల్లాకు ప‌సుపు బోర్డు తెస్తాన‌ని ఎవ‌రో బాండ్ పేప‌ర్ ఇచ్చారంట‌.. బాండ్ పేప‌ర్ ఇచ్చి రైతుల‌ను ద‌గా చేశారట అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉండ‌టం తెలియ‌దా అంటూ మండిపడ్డారు. అంతేకాదు ప్ర‌తి గ‌డ‌ప‌కు పూసే ప‌సుపు పండించే రైతు క‌ష్టాలు క‌న‌ప‌డ‌టం లేదా అని బైంసాలో మత‌క‌ల్లోలాలు సృష్టించ‌డంపై ఉన్న ఆస‌క్తి రైతుల క‌ష్టాల‌పై ఉండ‌టం లేదని షర్మిల ప్రశ్నించారు.