తాను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, February 24th, 2021, 10:03:39 PM IST


తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పలు విద్యార్థి సంఘాలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల తాను రాజకీయ పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. జగన్ ఎందుకు మీకు ఏ పదవి ఇవ్వలేదని కొందరు ప్రశ్నించగా ఆ విషయం ఆయననే అడగాలని షర్మిల చెప్పుకొచ్చారు.

అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం ఏంటని చాలా మంది విమర్శలు చేస్తున్నారని, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని షర్మిల స్పష్టం చేశారు. తాను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అని తాను తెలంగాణ కోడలినని అన్నారు. కేసీఆర్, విజయశాంతి ఎక్కడి వాళ్లని ప్రశ్నించారు. తనకు తన తల్లి విజయమ్మ మద్దతు ఉందని చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి గడపకు వెళ్తానని స్పష్టం చేశారు.