దొరల కుటుంబ పాలన అంతం కావాలి.. షర్మిల కీలక వ్యాఖ్యలు..!

Friday, March 19th, 2021, 09:36:48 PM IST


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీనీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు మరోసారి ఖమ్మం జిల్లా అభిమానులతో ఆమే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పార్టీ విధివిధానాలపై ఖమ్మం సభలోనే ప్రకటిస్తామని, చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ జరగాలని అన్నారు.

అంతేకాదు వైఎస్‌కు రెండు ప్రాంతాలు రెండు కళ్లలా ఉండేవని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం దొరల కుటుంబ పరిపాలన కొనసాగుతుందని అది పోయి రాజన్న పాలన రావాలని అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఇదిలా ఉంటే నేడు లోటస్ పాండ్‌లోని షర్మిలను పలువురు సెలబ్రెటీలు కలిశారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా కలిశారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని, దీనికి రాజకీయ ప్రమేయం లేదని వారు చెప్పుకొచ్చారు.