వైఎస్ షర్మిల సభకు ఊహించని షాక్.. ప్లెక్సీలు తొలగింపు..!

Thursday, April 8th, 2021, 09:09:13 PM IST


తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల రేపు ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ పేరును, పార్టీ విధి విధానాలను ప్రకటించబోతుంది. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఆమె అభిమానులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ముఖ్య అతిథిగా హాజర్ కాబోతున్నారు. అంతా సక్రమంగా ఉందన్న సమయంలో సహ్ర్మిల సభకు ఊహించని షాక్ తగిలింది.

అయితే షర్మిలకు స్వాగతం పలుకుతూ ఖమ్మంలో ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారని ఖమ్మం మున్సిపాలిటీ సిబ్బంది వాటిని తొలగించేశారు. ఖమ్మంలో వారం క్రితం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీ హోర్డింగుల ఏర్పాటు చేశారని, వాటి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయని మున్సిపాలిటీ సిబ్బంది ఇప్పుడు ఇలా చేయడమేంటని షర్మిల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ఫ్లెక్సీలకు, హోర్డింగులకు లేని అభ్యంతరం షర్మిల సభకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కాదు మొదట లక్ష మందితో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని అనుకున్నా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం ఆరు వేల మందితో మాత్రమే సభను నిర్వహించుకోవాలని ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు.